పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి,చెట్టు నుంచి శవాన్ని దించిభుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు .అప్పుడు శవంలో ని భేతాళుడు "రాజా !అచంచల మైన నీ దీక్ష ప్రశంసింపదగినవే.కాని,ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రం నాకు నిగూఢంగానే వున్నది.స్పష్టమైన అవగాహన లేని సుశాంతుడిలా అసంబద్ధం గా ,పరస్పర విరుద్దంగా అలోచించినప్పుడు కూడ ఒక్కొక్క సారి మౌనంపాటించవలసి వస్తుంది .నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి తగు హెచ్చరికగా నీకారాజు కధ చెబుతాను ,శ్రమ తెలియకుండ,విను" అంటూ ఇలా చెప్పసాగాడు:
పుష్పగిరిరాజు సుశాంతుడు పరమ వివేకి ఉదాత్త స్వభావం కలవాడు.అయితే,పున్నమి చంద్రుడిలో మచ్చ లాగ అయనకు వున్న ఒకే ఒక్క లోపం కోపం.తన ఇష్టానికి విరుద్దం గా ఏదైనా జరిగితే ఆగ్రహానికి గురయ్యేవాడు. ఒక సారి రాజాస్తానికి వచ్చిన అతిధులకు చేసిన వంటలో ఉప్పు కొంచం ఎక్కువ అయినది అని వంట వాళ్ళను పనిలోనుంచి తొలగించటమేగాక,రాజ్యం నుంచే వెడలగొట్టడు.అధికారులు కర్తవ్య నిర్వహణలో చిన్న పొరపాటు చేసినా కఠిన శిక్షలు అనుభవిచవలసి వచ్చేది.ఒక్కొక్క సారి ఉద్యోగాలతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు.రాజులో వున్న యీ కోపం కారణంగా,రాజ్యంలో ఏ ఆపద ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనలతో కాలం గడిపేవాళ్ళు.
ఒకసారి రాజు కొలువు తీరి వుండగా సాధువు వచ్చి,రాజును దర్సించి,"రాజా నా పేరు ప్రేమానందుడు.పది సంవత్సరాలు హిమాలయాలలో ధ్యానంలో గడిపాను.అది నాకు ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించినది.అయితే,వ్యక్తిగత మోక్షమే జీవిత పరమార్ధం కాదనీ ప్రజలకు మంచి మార్గం చూపవలసిన భాధ్యత నా మీద వుందనీ గురువు నాకు కర్తవ్య భోధ చేసాడు.ఆయన ఆదేశానుసారం నేను హిమాలయాలు దిగివచ్చాను తమ రాజ్యంలోని దేవాలయాలలో ధర్మభోధ చేయడానికి తమరు అనుమతించాలి,అన్నాడు."
రాజు ఆ మాటలకు పరమానందం చెంది,"మహాభాగ్యం,స్వామీ!మీరు ఇక్కడే కొన్నాళ్ళుండి మాకూ,మా ప్రజలకూ మంచి మార్గం చూపండి" అన్నాడు.
సర్వసంగ పరిత్యాగి అయిన వాడు ఒకే చోట వుండకూడదు.అయినా,నువ్వు కనబరుస్తున్న ప్రేమాదరాలు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వడం లేదు" అన్నాడు సాధువు.
సాధువుకు రాజోద్యానంలో కుటీరం నిర్మించబడినది.ఆయన అవసరాలు చూసుకునే బాధ్యతను ఉద్యానవన కాపలా భటుడూ,తోటమాలి అయిన సుమంగళుడికి అప్పగించ బడింది.సుమంగళుడు తన భార్యా,ఇద్దరు పిల్లలతో ఉద్యానవనంలో వున్న గుడిసెలో నివసిస్తున్నాడు
సాధువు రోజు వేకువజామునే లేచి,జపతపాలు పూర్తి చేసుకొని,రాజ సభలకు వెళ్ళి రాజు దగ్గర రెండు గంటల సేపు గడిపేవాడు.ఆయన హితవచనాలను రాజు అమితాసక్తితో ఆలకించేవాడు.సాయంకాలం సాధువు నగరం లోని దేవాలయాల వద్ద చేరే ప్రజలనుద్దేశించి ప్రసంగించేవాడు.అడిగిన వారికి తగిన సలహాలు ఇచ్చేవాడు.రాత్రికి కుటీరానికి తిరిగి వచ్చి,సుమంగళుడు వాడి భార్యా పిల్లలతో కలసి భోజనం చేసేవాడు.పడుకునే ముందు పిల్లలకు చక్కని కధలు చేప్పేవాడు.
ఒకనాటి సాయంకాలం రాజూ,సాధువు ఉద్యానవంలో ఏదో మాట్లాడుకుంటున్నారు.సుమంగళుడు పూల మొక్కలకు నీళ్ళు పడుతున్నాడు.అప్పుడు సాధువు ముఖం దగ్గర తుమ్మెదలు తిరుగుతూ ఆయనకి ఇబ్బంది కలిగించటం సుమంగళుడు గమనించాడు.వెంటనే పరిగెత్తుకొని పోయి,ఒక్క గెంతు గెంతి తుమ్మెదలను అవతలకి తరిమాడు.
తమ సంభాషణకు అంతరాయంగా తోటమాలి రావడంతో రాజుకి పట్టరాని కోపం వచ్చినది."ఎవరు నిన్నిలా రమ్మన్నది?సాధువుకు ఇబ్బంది కలిగిస్తే తుమ్మెదలను తరమడానికి నేను లేనా? మా మధ్య నువ్వెందుకిలా వచ్చావు?వెళ్ళిపో...ఇకపై నీ ముఖం నాకు చూపకు !"అని గద్దించాడు
సుమంగళుడికి భయంతో నోట మాట రాలేదు.అయితే అంతంలో సాధువు రాజుతో,"నాయనా అతన్ని దూషించకు.అతడి వుద్దేశం దోషరహితం కాదా? అయినా కోపం తెచ్చుకోవటం సులభం;అయితే కోపావేశంతో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావన్న నిజం నిలకడ మీద తెలుస్తాయి.కోపం వచ్చినప్పుడు మౌనం గా వుండి,మనసు కుదుటపడి మాములు స్థితికి వచ్చాక ఆ విషయంపై నిర్ణయం తీసుకోవటమే సుముచితం.కోపావేశంతో సుమంగళుణ్ణి వెళ్ళగొట్టావంటే,అతడి స్తానంలో ఆలాంటి సమర్ధుడూ,నిజాయితీపరుడు అయిన వ్యక్తి లభించడం సులభం కాదు కదా ! అన్నాడు మందహాసం చేస్తూ.
రాజు సాధువు సలహాను పాటించి,సుమంగళుణ్ణి క్షమించాడు.
సాధువు నీతి బోధలు రాజుని ఎంతగానో ప్రభావితం చేశాయి.కొన్ని నెలలు గడిచాక సాధువు రాజుతో,"సాధమైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలన్నదే నా జీవిత లక్ష్యం.పొరుగు రాజ్యాలకు వెళ్ళి మరింత మందికి మంచి మార్గం చూపలని వున్నది," అన్నాడు.
తమరిని వదిలి వుండడం అసాధ్యం మహాత్మా అన్నాడు !రాజు.
నా మాట విను నాయనా నేను ఎన్ని రాజ్యాలు తిరిగినా,ఎక్కడ వున్నా,మూడు నెలలకి ఒక సారి నీ వద్దకు వచ్చి,నీ క్షేమం,నీ ప్రజల బాగోగులను తెలుసుకొని వెళుతూ వుంటాను సరేనా?"అన్నాడు సాధువు. రాజు అందుకు అంగీకరించటంతో,ప్రేమానందుడు ఆ రోజే అక్కడికి నుంచి బయలుదేరి వెళ్ళి,పొరుగు రాయమైన పవనగిరిలో మూడు నెలలు గడిపాడు
ఆ తర్వాత ఒకనాడు పుష్పగిరికి తిరిగివచ్చడు.రాజధానీ నగరం చేరి రాజోద్యానం సమీపించేసరికి చీకటి అలముకున్నది.ఆయన రాకను సుమంగళుడు గమనించలేదు.దాహం వేయడంతో ఉద్యానవనం మధ్య వున్న తటాకం దగ్గరకి వెళ్ళి కమండలాన్ని నీళ్ళలోకి ముంచాడు.అలా ముంచినప్పుడు నీళ్ళ నుంచి గుడగుడమనే శబ్దం వచ్చినది.ఉద్యానవనంలోని గుడిసె చాటుగా చేతిలో ఈటెతో పొంచి వున్న సుమంగళుడు ఆ శబ్దం విన్నాడు.యి మధ్య వన్య మృగాలు రాత్రివేళ ఉద్యానవనంలో జొరబడి పాడు చేయడం వల్ల వాటికోసం వాడు మాటువేసి వున్నడు.
ఏదో వన్య మృగం తటాకం దగ్గరకి వచ్చినదని భావించి,ఈటెను తటాకం కేసి విసిరాడు.అదివెళ్ళి సాధువు వీపులో దిగబడింది.సాధువు అబ్బా అంటూ బాధతో మూలిగాడు.సుమంగళుడు అక్కడికి పరిగెత్తిపోయి చూసాడు.సాధువు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నాడు.సుమంగళుడు ఆయన పాదాలపైబడి కన్నీరు మున్నీరుగా విలపించాడు.
"ముందు వీపులో గుచ్చుకుని వున్న ఈటెను వెలికి తీయి.ప్రశాంతంగా ప్రాణం వదులు తాను,"అన్నాడు సాధువు.
సుమంగళుడు ఈటెను లాగి,సాధువును నేలపై పడుకోబెట్టి,"క్షమించండి స్వామీ !తెలియక చేసిన నేరం ఇది అన్నాడు ఏడుస్తూ
నాకు తెలుసు నాయనా !నిన్ను క్షమించాను,అంటూ సాధువు ప్రాణం విడిచాడు.సుమంగళుడు భయంతో వణికి పోయాడు.ఈ సంగతి రాజుకి తెలిస్తే,తన గతీ,తన పిల్లల గతీ ఏమవుతుంది?అని ఆలోచిస్తూ గుడిసెలోకి వెళ్ళి,జరిగినదాన్ని భార్యకు చెప్పి,రాత్రికి రాత్రే భార్యా పిల్లలతో సహా నగరం వదిలి వెళ్ళిపోయాడు.
మరునాడు రాజభటులు ఉద్యానవనంలో సాధువు శవాన్ని చూసి సుమంగళుడి కోసంవెతికారు.వాడి జాడ తెలియ లేదు. ఏ కారణం వల్లనో సుమంగళుడే సాధువును హత్య చేసి ఎటో పారిపూయాడన్న నిర్ణయానికి వచ్చారు.ఆ సంగతి రాజుకి తెలియ చేసారు.రాజు ఆగ్రహావేశానికి అంతులేకుండా పోయింది.రాజ్యమంతటా సుమంగళుడి కోసం వెతక మన్నాడు,అయినా వాడు దొరకలేదు.
సుమంగళుడు పొరుగు రాజ్యానికి వెళ్ళి పోయాడు.ఒక సంవత్సరకాలం గడిచినది.కాని వాడక్కడ సంతోషంగా వుండలేకపోయాడు.వాడికి పుష్పగిరికి తిరిగి రావలనిపించినది.ఒకనాడు రహస్యంగా పుష్పగిరికి వచ్చి రాజా స్థానంలో ఉద్యోగాలలొ వున్న తన బాల్య మిత్రుణ్ణి కలుసుకొని జరిగినది చెప్పి సాధువు మరణానికి సంబంధించి రాజు తనపై ఇంకా ఆగ్రహంగా వున్నడా లేదా అని తెలుసుకోమన్నాడు.
వాడి మిత్రుడు రాజు మనోభావాన్ని తెలుసుకోవడానికి సరైన అవకాసం కోసం ఎదురు చుడాసాగాడు.ఒకనాడు వేరొక రాజోద్యోగి రాజు దగ్గరకి వచ్చి ,కొత్తగా పనిలో చేరిన తోటమాలి మాటిమాటికీ ఏవేవో పరికరాలుచెప్పడం విన్నాడు.ఇదే మంచి సమయం అనుకొని అతడు రాజు తో"సుమంగళుడు చాలా సమర్ధుడైన తోటమాలి.పరికరాల కోశం అంత ఖర్చుపెట్టేవాడు కాదు "అన్నాడు.
అయితే రాజు ఆ మాటకు బదులు పలకలేదు.అతడు ఆ సంగతి సుమంగళుడికి చెప్పి,మరి కొన్నాళ్ళు దూరం గానే ఉండమని సలహా ఇచాడు.మరొక ఆరు నెలలు గడిచింది.సుమంగళుడు మళ్ళీ తన మిత్రుడిని కలసుకోని రాజుతో తన సంగతి విన్నవించమన్నాడు.మిత్రుడు ప్రయత్నించాడు కానీ,ఇప్పుడు కూడా రాజు మౌనంగానే ఉండిపోయాడు.
మరొక ఆరు నెలలు గడిచాయి.సుమంగళుడు ఆగలేక,ప్రాణాలకి తెగించి,తన కుటుంబంతో సహా పుష్పగిరికి తిరిగి వచ్చాడు.తిన్నగా రాజాస్థానికే వెళ్ళి రాజు పాదాలపై బడి,సాధువు అకాల మరణం గురించి జరిగినదంతా వివరించి,తనను క్షమించమని వేడుకున్నాడు.
"సుమంగళా,ఉద్దేశపూర్వకంగా నువ్వా పని చెయ్యలేదని నాకు తెలుసు వచ్చి కొలువులో చేరు.అన్నాడు రాజు.
భేతాళుడు ఈ కధ చెప్పి,"రాజా సుమంగళుడి బాల్య మిత్రుడు వాడి సమర్ధతనూ,మంచి తనాన్ని గురించి చెప్పిన రెండు సార్లూ రాజు సుశాంతుడు బదులేమీ పలకకుండా మౌనం వహించాడు.అయితే రెండేల్ల తరవాత సుమంగళుడే స్వయంగా వచ్చి పాదాలపై బడి జరిగినదంతా వివరించాక వాణ్ణి క్షమించి కొలువులోకి తీసుకువచ్చాడు.ఇక్కడ రాజు ప్రవర్తనలో అసంభద్ధత,వైరుధ్యం కనిపించటంలేదా?సుమంగళుడు చెప్పిన తర్వతే రాజు అసలు విషయం గ్రహించాడా లేక అంతకు ముందే గ్రహించాడా?యి ప్రస్నలకి సమాధానం తెలిసి చెప్పక పొయావో నీ తల పగిలిపోతుంది, అన్నాడు.
దానికి విక్రమార్కుడు,"రాజు సుశాంతుడు ప్రవర్తనలో ఏ మాత్రం అసంబ్ధతా వైరుధ్యం లేదు.సాధువు మరనణం ప్రమాదవశాత్తు జరిగినదే తప్ప,సుమంగళుడు ఉద్దెసపూర్వకంగా ఆయన్ను చంపలేదు అని రాజు ఎప్పుడో గ్రహించాడు.ఆయనకు సుమంగళుడు స్వభావం తెలుసు.అయితే తాను ఎంతో గౌరవించే సాధువు ప్రేమానందుడు హఠాత్తుగా ఘోరమరణం చెందటంతో రాజు ఆగ్రహించిన మాట వాస్తవమే.రాజుకు ఉన్న ఒకే ఒక బలహీనత కోపం అన్న సంగతి అందరికి తెలుసు.కోపంగా వున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దు అనీ,మాములు స్తితికి వచ్చిన తర్వాతే ఒక నిర్ణయనికి రమ్మనీ ప్రేమానందుడు రాజుకి సలహా ఇచ్చాడు.సుమంగళుడి మిత్రుడు తొలిసారిగా వాడి మంచితనాన్ని ప్రస్తావించినప్పుడు కూడా రాజు కొంత ఆగ్రహంగానే వున్న్నాడు.అయినా సాధువు సలహాను పాటించి మౌనంగా వున్నాడు.రెండవ సారి ప్రస్తావించినప్పుడు మరింత తీవ్రంగా అలోచించసాగాడు.దుర్ఘటన జరిగి రెండేళ్ళు కావటంతో కాలమే ఆయన భాధను తగ్గించింది.అందువల్లనే సుమంగళుడు స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పుకోవటంతో వాణ్ణి క్షమించాడు.మొదటి రెండు సార్లు మౌనం వహించటానికి కారణం సాధువు సలహాను పాటిస్తూ అయన చూపిన మనోనిగ్రహం.అంతే గాని అయన అలోచనా విధానంలో ఎలాంటి అసంభద్ధతా,వైరుధ్యాలూ లేవు,అన్నాడు.రాజుకి యి విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చేట్టేక్కాడు.
Read more...