చూతము రారండి
విజయా వారి మాయాబజార్ సినిమా నవలకి వి.ఏ.కె.రంగారావు గారు వ్రాసిన ముందు మాట నుంచి :
ఇంతవరకు ఈ కథ తో భారతీయ "మాయాబజార్" వత్సలా కల్యాణం" "శశిరేఖాపరిణయం" "సురేఖాహరణ్","వీరఘటోత్కచ" అన్న పేర్లతో వచ్చిన సినిమాలు ఒకటి మూకీ,పది టాకీలు.వేరే పేర్లతో ఇదే కధ రావటం కి ఆస్కారం లేదు.
మొదటిది మూకీ చిత్రం "మాయాబజార్ ఉరఫ్ సురేఖాహరణ్"(1925) దర్శకుడు బాబురావ్ పెయింటర్.ఇందులో కృష్ణుడు వి.శాంతారాం .
మొదటి టాకీ,హిందీ లో పై రెండు పేర్లతోనే 1932 లో విడుదలైనది.దర్శకుడు నానుభాయి వకీల్.మూడవది అరవంలో ఆర్.పద్మనాభన్ తీసిన "మాయబజార్ ఉరఫ్ వత్సలా కళ్యాణం(1935)". నాలుగవది పి.వి.దాసు తెలుగు చిత్రం "మాయబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం". ఇందులో శాంతకుమారి శశిరేఖ.
అయిదవది మరాఠి లో జి.పి.పవార్ నిర్మించిన "మాయాబజార్".ఆరవది హిందీ మరాఠిలలో దత్తాధర్మాధికారిది;"మాయబజార్ ఉరఫ్ వత్సాలాహరణ్"(1949).ఏడవది నానాభాయి భట్ట్ నిర్మించిన "వీర్ ఘటోత్కచ్ ఉరఫ్ సురేఖా హరణ్"హిందీ లో అదే సంవత్సరం విడుదలైంది.
హీరోయిన్ గా ఇది నటి మీనాకుమారికి మూడవదో నాలుగోదో.
ఎనిమిదవది:తెలుగు తమిళాలలో "శశిరేఖా పరిణయం" వత్సలా కళ్యాణం"లని మొదట తలపెట్టి చివరికి రెండు భాషల్లోనూ
"మాయాబజార్"(1957)గానే విడుదలయైన ప్రస్తుతాంశమైన చిత్రం.ఇది పద్నాలుగేళ్ళ తరవాత అదే పేరుతో హిందీలోకి అనువదించబడినది(1971).
తొమ్మిదవది: బాబూభాయి మిస్త్రీ హిందీలో నిర్మించిన "మాయాబజార్"(1958) మన చిత్రం తరువాతి సంవత్సరమే విడుదలై తెలుగు ,అరవం,కన్నడ భాషల్లోనికి "వీర ఘటోత్కచ "గా పరివర్తింపబడినది.ఇందు నాయిక అనితా గుహ. పదవది హిందీలో శాంతీలాల్ సోనే తీసిన "వీర్ ఘటోత్కచ"(1970)
పదకొండవది తిరిగి బాబూభాయి మిస్త్రీ తీసిందే "మాయాబజార్"(1984) హిందీ గుజరాతీ భాషల్లొ,రంగుల్లో.
"లక్ష్మణ కుమారుడు ,వీరాధివీరుడైన దుర్యోధనుని కుమరుడే,అతన్నేమిటి చిత్రం లో వెర్రి వెంగళప్పలాగ వెకిలి గా చిత్రించారు" ? అన్న విమర్శలు ఆ రోజుల్లో వినిపించాయి.ఆ విమర్శ గురించి రచయిత పింగళి నాగేంద్రగారు మాట్లాడుతూ "లక్ష్మణ కుమారుదు ధీరుడనో,శూరుడనో మహాభారతం లో లేదు .అతనిది పెద్ద పాత్ర కూడా కాదు.భరత యుద్ధం జరిగినప్పుడు ,యుద్ధం లో ప్రవేశిస్తూనే అభిమన్యుడి చేతిలో మరణించాడు లక్ష్మణ కుమారుడు.ఆ చిన్న విషయాన్ని తీసుకొని,ఆ పాత్రను హాస్య పాత్రను చేసి మలిచాము.అదేం తప్పు కాదు,
క్యారెక్టరైజేషన్ లో ఔనిత్యం ఉంటే,ఆ ఔనిత్యాన్ని కాదని ,ఆ పాత్రను నీచంగా చిత్రిస్తే తప్పు కాని,ఎలాంటి పాత్రత లేని ఒక పాత్రను తీసుకొని దాన్ని హాస్యన్ని వాడుకోటంలో తప్పు లేదు;అది అనౌచిత్యము కాదు" అన్నారు.
వివాహ భోజనంబు ట్యూను పూర్వపరాలేమిటి? వి.ఏ.కె.రంగారావు చెప్పినది;"1930 ప్రాంతాల బ్రిటన్,అమెరికా దేశల్లో రంగస్థలం మీద చిన్న ప్రహసనాల్లాంటివి చేసేవారు.ఆయా నటులు వాళ్ళ దుస్తుల్ని ఒక తోపుడు బండిలో వేసుకొని రంగస్థలం మీదకి తోసుకుంటూ వచ్చేవారు.
వస్తున్నప్పుడు ఆ బండి చక్రాల ద్వని వినిపించకుండా దాని మీద వాద్యగోష్టి వచ్చేది.అది 'వివాహ భోజనంబూ వరస,మీటరూ.అటు తరువాత ఆ ట్యూనును "మెక్సికన్ మెర్రి గో రౌండ్" అనే పాటగా మలిచారు.ఆ వినోద కాలక్షేపాలు మన దేశంలో కూడా ప్రదర్శింపబడినప్పుడు ,ఆ ట్యూనుని మన వాళ్ళు గ్రహించి ఉంటారు"
విడుదలై 50 సంవత్సరాలు పైన ఐనా "విజయ"ఢంకా మోగిస్తున్న చిత్రం మరొకటి కనిపించదు !అస్తు!!