జీవితానుభవం -చలం
ఒకప్పుడు ధనవంతులని ద్వేషించాను.నా ప్రతి రక్తం కణం లో ను అసూయ నిండి వుండేది .అవును మరి- కోటాను కోట్ల మంది ఆకలి మంటల్లో అలమటిస్తుంటే వాళ్లు సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు !యీ సిద్ధాంతం మీదనే నేను ధనికులని ద్వేషించాను.
ఆ రోజులలో నేను ఎన్ని బాధలు పడ్డాను !నా పద్దెనిమిదో యేట మా తల్లి తండ్రులు గతించారు .నా చెల్లెలు నాకంటే మూడేళ్ళు చిన్న.అప్పటికి పెళ్లి కాలేదు. మా బ్రతుకు భారం నా నెత్తిన పడింది. తండ్రి ఆస్తి గా ఓ పూరి కొంప తప్ప మాకేమీ లేదు .
ఒక ఫ్యాక్టరీ సామాన్య గుమాస్తా పనికి కుదిరాను.నెలకు పదిహేనురూపాయలు జీతం.దానితో జీవించాలి.ఎప్పుడయినా అస్వస్థత వల్ల పని మానితే సంపాదన కురచ అయ్యేది .
తక్కువ రకపు ఆహారానికి అలవాటు పట్టం మాకెంతో కాలం పట్టలేదు. అదే ఇంత దుస్థితి లోపర్వదినాన ఏమైనా వండి పిండి వంట చేసేది చెల్లి. అమితానందం తో భుజించే వాడిని .ఒక్కో సారి దుస్తులు చినిగి ఎంతో భాదపడేవాళ్ళం కొనటానికి .దుప్పటి కొనాలి అంటే డబ్బు వుండేది కాదు.అంగవస్త్రం మొలకుచుట్ట కట్టుబట్ట కప్పుకోనేవాడిని. దానితోనే సంతృప్తి కలిగేది ,తప్పదు మరి.
ఇంత దుస్థితి లో వుండి కుడా చదువంటే చెవికోసుకొనే వాణ్ణి,చదవటానికి గ్రంధాలు ఎలా వస్తాయి?కనీసం పత్రికలూ కొనటానికి కూడా డబ్బు వుండేది కాదు.ఏనాడయినా ఫ్యాక్టరీలో అదృష్టవశాత్తు రాత్రి పని లభిస్తే అమితానందం కలిగేది.ఆ డబ్బుతో సాహిత్యం కొనేవాణ్ణి.అంత కష్టపడి కొన్న పుస్తకాలు,పత్రికలూ కావటం చేత ఎంతో శ్రద్దగా చదివేవాణ్ణి.
అప్పుడప్పుడు స్టాలు కి పోయి గ్రంధాలు తిరగవేసేవాణ్ణి.స్టాలు గుమాస్తాలు కోపం వచ్చేది "పో పొమ్మ"ని కసిరేవాడు.సిగ్గుపడే వాణ్ణి కాదు.పేదవాడికి సిగ్గు ఎందుకు ?ప్రాధేయ పడి అతని మనసు కరిగించి,సాహిత్యాన్నిచవిచూసే వాణ్ణి.
ఒక సారి స్టాలులొ ఒక గ్రంధం చూసాను .తొలి పేజీ చూడటం తోనే అది అమూల్యమైనదని గుర్తించాను కాని... కొనటమెలా ? పదిరోజుల సంపాదన యిచ్చుకోవాలి.
చెల్లి తో సంప్రదించాను.ఆ గ్రంధాన్ని భూమ్యాకాశాల చెల్లి దగ్గర స్తుతించాను.తత్ఫలితం గా ఆ నెల కొనవలసిన చొక్కాగుడ్డల జాబితాలతో కొట్టివేసింది.ఆత్రుతతో స్టాలుకు పరువేత్తాను ఆలస్యం జరిగినా ఆ పుస్తకం నాకు దక్కదేమో నని భయపడ్డాను.నాకోసం అది అక్కడేవున్నందుకు ఆనందపడ్డాను.
కొన్నాళ్ళకు నాతొలి రచన పత్రికలో వెలువడింది.దానిలో పేదవాళ్ళ కష్టాలను గుండెలు తరుక్కుపొయేలా చిత్రించాను.ఎంతో మంది మిత్రులు నా ప్రతిభను కొనియాడారు.ఆ పత్రికా సంపాదకుడు నన్ను శ్లాఘిస్తూ "మీరు ప్రత్యేకం మా పత్రికకు రచనలిస్తువుండండి .తగిన ప్రతిఫలం ముట్ట చెప్పటానికి మా అధికారిని వొప్పించాను "అంటూ లేఖ వ్రాసాడు.
సర్వశక్తులనీ బలికొంటున్న గుమాస్తా నౌకరీకి ఆనాడే రాజీనామా పెట్తి ,సాహిత్య సేవకు పూనుకున్నాను కొద్దిరోజులలోనే సాహిత్య గగనాస ఉజ్వలతారగా ప్రకాశించాను.పత్రికా రచయితగా వుంటునే గ్రంధకర్తనయ్యాను .పాఠకలోకం నా గ్రంధాలకు మంచి ఆదరణచూపింది.ప్రతి సంపుటీ లక్షల తరవడి ప్రతుల ఖర్చు అయినాయి -తత్కారణంగా పేదరికం నుండి ధనికుడిగా మారిపోయాను ఈనాడు డబ్బుతో లభించే సర్వసుఖాలు అందుబాటులొ ఉన్నాయి.నా భోజన పళ్లేరంలో విలువైన పదార్ధలు వుంటున్నవి.కాని ఏ ఒక్కటీ రుచించదు.పుస్తకాలు కొనిచదవాలి అనేకాంక్ష పోయినది.అయినా ఎవరో ఒకరు వారి వారి గ్రంధాలనునాకంపి నా అభిప్రాయం తెలుపవలసినదిగా కోరతారు .వాటిని చదివే ఓపిక తీరికా నాకు లేకుండా పోయింది.చదవకుండానే కొందరికి మీ గ్రంధం బాగున్నదని లేఖలు వ్రాసేవాణ్ణి మరికొందరికి అదీ లేదు .
ఇప్పుడు ప్రతి నాటకానికి సినిమాకి మొదటి తరగతిలో హజరవుతాను.కాని పేదరికంలో నా చెల్లితొ కలిసి చివరి తరగతిలో కూచుని శ్రద్దగా చూసినట్లు చుడలేకపోతున్నాను.ప్రతి విషయంలోను నా స్థితి ఇలానే వుంటోంది .
ఇంతకాలమయాక నా జీవితానుభవంలో గుర్తించిన సత్యమేమిటంటే-"ధనవంతుడికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి .కాని వాళ్ల సౌఖ్యాలలో ఆనందం లేదు.పైగా ఆ జీవితం అశాంతికి ఆలవాలం.పేదరికపు కష్టాలలో శాంతి,ఆనందం తొనికిసలాడుతోంటై అని.ఏమంటారు ??
26 comments:
చలం గారి జీవిటానుభావం పోస్ట్ చేసినందుకు థాంక్స్ అన్వేషిగారు... చలం గారి పేరు వినటమే తప్ప... ఎప్పుడూ వారి రచనలు చదవలేదు... వారి గురించి రవ్వంతైనా తెలీదు... మీ పోస్ట్ చదివాక వారి గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది!
చలం గురించి ఆయన మనవరాలు ఏమన్నారో కూడా కాస్త పోస్టితే బాగుంటుంది :)
చైతన్య
తప్పకుండా తెలుసుకోండి :)
జీడిపప్పు
నేను పోష్ట్ చెయ్యక్కరలేదులే ఈనాడు వాడు ఎప్పుడో ఆ పని చేశాడు.
http://www.eenadu.net/sahithyam/display.asp?url=main319.htm
చలం /చలం శైలి అందరికి నచ్చే/అర్దం అయ్యే రచయిత కాదు.అయన్ని విమర్శించే సాహిత్యం కుడా నాకు తెలియదు :)
1968 లో ఒక interview లో చలం ని అడిగిన ప్రశ్న
Q :ఈనాడు రాస్తున్న తెలుగు యువ రచయితలకి -రచయిత్రులకి మీరిచ్చే సందేశం యేమిటి ?
Ans :హౄదయంలో కలం ముంచి రాయమని సందేశమిద్దామనుకున్నాను.కాని హౄదయాలు చిరగని గట్టి మడతల కింద పాతుకు పోయినాయి.అందుకని నా సందేశం పూర్తిగా వౄధా -అని తెలుసు నాకు
నేను చలం పుస్తకాలు చదవలేదు కానీ, చలం మనవరాలు మాటలను పట్టి చూస్తే చలం తెలుగు సాహితీ రంగానికి ఒక చీడపురుగు అనిపిస్తున్నది. వ్యక్తిగా పరమ నిక్రుష్టుడు అనిపిస్తున్నది. చలాన్ని గొప్ప రచయిత అనే వాళ్ళలో ఎంతమంది మగవాళ్ళు "నేను చలంలా బ్రతుకుతున్నాను" అని చెప్పారు లేదా ఎంతమంది ఆడవాళ్ళు "నా భర్త/కొడుకు చలంలా ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు?
@జీడిపప్పు:
చలాన్ని అభిమానించటం ఆ కాలంలోనూ, ఈ కాలంలోనూ ఒక ఫ్యాషన్. అంతే. ఆయనవి అంత గొప్ప రచనలేం కాదు. (నాకైతే ఆయన గ్రామర్ కూడా విచిత్రంగా అనిపిస్తుంది - 'వస్తో', 'పోతో', 'ఉంటో' .. ఇలా). పదహారేళ్ల వయసులో నేను చలం 'మైదానం' చదివాను. బహు రోతగా అనిపించింది. మీరన్నట్లు, ఆయన రచనల్ని ఆహా ఓహో అంటూ ఎత్తేసేవాళ్లెవరూ ఆయా పాత్రలని నిజజీవితాల్లో అనుకరించటానికి ఇష్టపడరు.
ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటివాడో మనకనవసరం. రచయితగా మాత్రం నిస్సందేహంగా ఓవర్ రేటెడ్.
చలం వ్యక్తికాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోయిన మానవతలోని ఒక పార్శ్వాన్ని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి.
మనుషులూ, మనసులూ,విలువలూ,నమ్మకాలూ,ఆకర్షణలూ,ఆవేశాలూ అన్నీ మారతాయని చెప్పిన చలం, తన విధానాన్ని మార్చుకుంటే నిరసించాల్సిన అవసరం లేదు.
ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత,వైవాహిక,సాంఘిక జీవితంలో పెద్ద విఫలురిగా కనిపిస్తారు. అది మన సాధారణ కోణంలోంచీ చూస్తే అలాగే అనిపిస్తుందికూడా. కానీ Their contribution will be measured by a collective consciousness of a society.
చలం సాహిత్యం over rated అనుకునేవాళ్ళకు ప్రపంచసాహిత్యంతో పరిచయం లేదనుకోవాలి. James joeys తన stream of consciousness శైలిలో కుస్తీలు పడుతున్న సమయానికి చలం "మ్యూజింగ్స్" రాసేశాడు. ప్రపంచ సాహిత్యం Absurd,abstract, magic realism అనే మాటలు వంటబట్టించుకున్న సమయంలో చలం "మైదానం" సృష్టించాడు.
చలం ఇంగ్లీషులో రాయలేదుగాబట్టి ఈ ఖర్మగానీ, లేకపోతే ఎప్పుడో నోబెల్ బహుమతి వచ్చేది. ఇక మరో ఖర్మ తను తెలుగు పాఠకులకోసం రాయడం. చాలా మంది చదవకుండానే విమర్శిస్తారు, మరికొందరు చదివి అర్థం చేసుకునే ధైర్యం లేక తిట్టిపోస్తారు. మనమింతే!
అబ్రకదబ్ర,
ఎంత ఓపెన్ గా చెప్పేశారో!
మైదానం ఎంతగా ప్రయత్నించినా నేను పాజిటివ్ గా అర్థం చేసుకోలేకపోయాను. కానీ శేషమ్మ కథల సంపుటి చదివారా? అందులో కథలన్నీ భలే ఉంటాయి. గ్రామర్ వదిలేయండి. అలాగే నాకు బాగా నచ్చిన మరో పుస్తకం "బ్రాహ్మణీకం"! చలం పుస్తకాలన్నీ చదివాను. చాలా వరకు నా దగ్గరున్నాయి కూడా! విచిత్రంగా నాకు ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ నాకంతగా నచ్చలేదు.
మహేష్,
మీరు చలం గురించి ఒక సిరీస్ రాస్తే బాగుంటుందేమో చూడండి!
@జీడిపప్పు
చలం పుస్తకాలని చదవకుండానే/అవి అర్దం కాకుండనే నువ్వు judgement చేస్తె నవ్వటం టప్ప ఏమీ చెయ్యలేను :)
చలం మనవారలు ఏం అన్నారు?ఎందుకు అన్నారు అనేది ఒక article లో తేలేది కాదు.సాహిత్యాన్ని చదవాలి /ఆ రచనల వెనక హౄదయం అర్ధం చేసుకోటం కి ప్రయత్నించాలి .ఏవి చెయ్యకుండా వఖితగి వ్యక్తిగత చేస్తాం అంటే మరో చిరునవ్వు :)
@అబ్రకదబ్ర
కోసం సాహిత్యన్ని చదవటం /కోసం రచయితలు నచ్చటం అనేది మొదటి సారిగా చూస్తున్న
మన id లే అర్దం కాని /లేని పదాలు ఇంక శైలి గురించి మట్లాడటం హాస్యాస్పదం.
చలం శైలి ....
బాధ పడాలి !నలగాలి !
జీవిత రధ చక్రాల కింద
కలంలోంచి నెత్తురు వొలకాలంటే
అక్షరాల?పాండిత్యమా ?
కాదు
సంవత్సరాల మూగవేదన
అంధకారమో అన్వేషణ
దిక్కులేని దుర్భలుల జీర్ణావేశం
ఎవరితోనూ చెప్పుకోలేని
అధమ చారిత్రల గర్భశొకం-
యిదీ నా శైలీ !
చలం
@మహేష్ కుమార్ "కత్తి" లా వుంది మీ comment :)
@సుజాత: చలాన్ని ఆస్వాదించి అనుభవించడమేతప్ప అర్థం చేసుకు దాన్ని విడమర్చి చెప్పే సాహసాన్ని చెయ్యలేను. అంత పరిణితి నాకు లేదు. కాకపోతే, ఒక్క విషయం మాత్రం చెప్పగలను.Chalam works appeal to my primordial instincts that are still raw and formative.
మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని, వ్యక్తిగతంగా అనుభవించి మన meaninglessness ని,futility ని, insignificance ని,guilt ని celebrate చేసుకోవాలేగానీ, సాహితీవిమర్శనమో లేక సామాజిక దర్శనమో కొలమానాలుగా కొలవకూడదని నా నమ్మకం.
Chalam is personal to anyone and everyone who reads him.అనుభవించండి. Intellectual and emotional limitations మధ్య అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకండి.
@ అన్వేషి గారు - "చదవకుండా ఎవరో చెప్పింది విని జడ్జ్‌మెంట్ చెయ్యడం" అన్నారు. సాధారణంగా ఒక సినిమా చెత్తగా ఉంది అని నలుగురు చెప్పిన తర్వాత కూడా ఆ సినిమాను చూసే రకం కాదు నేను (ఒక్క మినహాయింపు మినహా :) ).
పోతే, ఇప్పటివరకు ఎంతమంది రచయితల రచనలు చదివి "పాడై పోతున్నారు" అని విన్నాము?
ఏదో ఒకరిద్దరు అయితే పర్లేదు కానీ చాలామంది తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న తమ కూతుళ్ళకు చలం పుస్తకాలను చదవమని పొరపాటునకూడా చెప్పరు. పైగా వాళ్ళు చదువుతున్నారంటే తిడతారు. భర్త "నేను ఇక చలంలా బ్రతకాలి అనుకుంటున్నాను" అని భార్య వణికిపోతుంది. ఎందుకంటారు?
నేను చలంపై వ్యక్తిగత విమర్శలు చెయ్యలేదు. ఆ సంగతి నా పై వ్యాఖ్యలో స్పష్టంగా ఉంది. ఆయన శైలి గురించీ నేను మాట్లాడలేదు .. 'రాస్తో', 'పడుతో' వంటి ప్రయోగాలు వింతగా అనిపించాయని మాత్రమే అన్నాను. ఎవరినైనా అభిమానించేవారికి ఉన్నట్లే విభేదించేవారికీ తమవైన అభిప్రాయాలుంటాయి. ఆయన రచనలు చదవకుండా విమర్శలు చేస్తున్నాననో, ప్రపంచ సాహిత్యంతో నాకు పరిచయం లేదనో అనటంపై నేను వ్యాఖ్యానించవలసిందేమీ లేదు.
మహేష్, 'నేను అర్ధం చేసుకుని ఆచరించిన వాటి గురించే మాట్లాడతాను' అనేది మీరు తరచూ అనే మాట. ఎదుటివాళ్లూ అలాగే ఉంటారని ఎందుకనుకోరు? నా అభిప్రాయాలూ, భావాలూ అన్నీ నేను అర్ధం చేసుకుని అమల్లో పెట్టినవే. అవి మీవంటి, చలం వంటి వారి భావాలకు వ్యతిరేకంగా ఉన్నంతమాత్రాన కొట్టిపారేయవలసినవి కావు. చలం రచనల్లో చెప్పిన విషయాలు నేను నమ్మిన విలువలకీ, నా తత్వానికీ సరిపడవు. అంత మాత్రాన నేనేదో బూజు పట్టిన ప్రగతి నిరోధక భావాల వాడినీ కాను - ఆ సంగతి అందరికన్నా మీకే ఎక్కువ తెలిసుండాలి.
మీ వరకూ మీరు చలం భావాలను అభిమానించి, అర్ధం చేసుకుని, అమల్లో పెట్టిన వారై ఉండొచ్చు. కానీ ఆయన అభిమానులంతా ఆ పనే చేస్తారని చెప్పగలరా? చెయ్యనప్పుడీ హిపోక్రసీ ఎందుకు? వాళ్లకన్నా ఆయన రచనలు నాకర్ధం కావు/నచ్చవు అని పబ్లిక్‌గా చెప్పే నావంటి వారు మెరుగు.
తెలుగు సాహితీరంగంలో చలం రచనలు కొరడా దెబ్బల్లాంటివి. చలాన్ని చదివిన వారెవ్వరైనా ఆయన్ని తీవ్రంగా అభిమానించగలరు, లేదా తీవ్రంగా ద్వేషించగలరు కానీ మధ్యస్థంగా ఉండటం కష్టం. పైన మహేష్ గారు చెప్పినట్లు చలాన్ని విడమర్చి చెప్పటం సాహసమే. నేను అటువంటి సాహసానికే పూనుకుని ధైర్యం చాలక ఆ టపాని ప్రచరించకుండా ఉంచేసాను.
@అబ్రకదబ్ర:
చలం పాత్రల్ని నిజజీవితంలో అనుకరించటానికి కావల్సింది ఇష్టం కాదండీ, సాహసం కావాలి. హృదయానికి, నోటికి మధ్య ఫిల్టర్ లేని జీవితం గడిపాడు ఆయన. అలాంటి జీవితం గడపటానికి చాలా సాహసం కావాలి. చలాన్ని ఏ కాస్త అర్థం చేసుకున్నవారైనా ఆయనంత నిజాయితీగా బ్రతికే సాహసం చేయలేకపోవచ్చు కానీ, తమ జీవితాల్లో, నమ్మకాల్లో ఉన్న హిపోక్రసీని కొంతైనా అర్థం చేసుకోగలుగుతారు. నా వరకు చలం ఖచ్చితంగా అండర్ రేటెడ్ రచయితే.
జీడిపప్పు
"ఒక సినిమా చెత్తగా ఉంది అని నలుగురు చెప్పిన తర్వాత కూడా ఆ సినిమాను చూసే రకం కాదు నేను (ఒక్క మినహాయింపు మినహా :) )."
ఇది చూసి comment చెయ్యక్కరలేదు అనుకున్నా కాని ..విశ్వనాధ గారి quotes post చెయ్యాలనిపించినది :)
"పాపం !భర్తౄహరి "సర్వవిదాం సమాజే విభుషణం మౌన మపండితానాం" అన్నాడు.అనగా పండితుల సభలో అపండితుడు మాట్లాడకుండా ఉరుకోవటం మంచిది అని దాని తాత్పర్యం.ఇప్పుడు దానికంతా వ్యతిరేకం.పండితుడు మాట్లాడకుండా వుంటే మంచిది.
పద్యం అర్ధం కాక పోతే పూర్వకాలంలో పఠితది తప్పు అనేవారు.నేడు కవిది తప్పు అంటున్నారు. "
"ఒకటేదో కాదనాలి,ఒకరినెవరినో నిందించాలి,
అది మంచైనా,చెడ్డైనా ఏదో ఒక కొత్త రాస్తా తొక్కాలి,తోచిందో,తోయందో ఏదో ఒకటి కక్కాలి.
అదీ వరస.అతనికి తెలియదు సవ్యమైనది అంతా ఎప్పటికీ నవ్యం కూడ అవుతుంది అని కానీ నవ్యమైనది అంతా సవ్యం కాక పోవచ్చునని."
>> "పద్యం అర్ధం కాక పోతే పూర్వకాలంలో పఠితది తప్పు అనేవారు.నేడు కవిది తప్పు అంటున్నారు"
అర్ధం పర్ధం లేని రాతల్ని వెనకేసుకురావటానికి ఇదో అద్భుతమైన చిట్కా - అర్ధం కాలేదన్నోడు శుంఠగా ముద్రేయటం. చలం రాతలు రాజుగారి దేవతా వస్త్రాలు. దట్సాల్.
>> "ఒకటేదో కాదనాలి, ఒకరినెవరినో నిందించాలి, అది మంచైనా,చెడ్డైనా ఏదో ఒక కొత్త రాస్తా తొక్కాలి,తోచిందో,తోయందో ఏదో ఒకటి కక్కాలి"
చలం చేసిందీ అదే మరి.
చలం రాతలు రాజుగారి దేవతా వస్త్రాలు కధ నిజమే
నవీన్ గారి మాటల్లో కళ్ళముందు కనిపిస్త్తున్న వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా నిర్భయం గా చెప్పేయటం చలం నైజం.ఏ దాపరికాలు లేకుండా,ఏ భేషజాలు లేకుండా వున్న వాస్తవాన్ని వున్నట్టుగా వాడిగా ,వేడిగా తనదైన సజీవ భాషలో చెప్పటం వల్లే అనేక వేల మంది ప్రాఠకుల హౄదయల్లో పలికాడు.
ఇప్పుడే మీరిచ్చిన లింక్‌లో తురగా జానకీ రాణి గారి అభిప్రాయాలు చదివాను.
>> "ప్రశ్నలు వేయకుండా, సమాధానాలకోసం అన్వేషించకుండా 'జై జై చలం' అని జైకొట్టేవారి కృత్రిమత్వాన్నీ, చిత్తశుద్ధినీ శంకిస్తాను"
ఆయన మనవరాలి అభిప్రాయమది. నేను పైనన్నదీ అదే.
చలం జీవితంలోని ఈ కోణం నాకు తెలీదు. ఆయన పుస్తకాలు చదవటమే కానీ ఆయన గురించి చదవటం ఇప్పుడే. వ్యక్తిగత విమర్శ చెయ్యనని నేనన్న మాట పక్కనబెట్టి ఇప్పుడనాలనిపిస్తుంది - మేధావులని పిచ్చోళ్లనటం ఒక రకం పోకడ, పిచ్చోడిని మేధావనటం మరో రకం. చలం విషయంలో జరిగింది నిస్సందేహంగా రెండోదే.
చలం సాహిత్యం ఉత్తమ కోవకు చెందినదే.స్త్రీ పట్ల వేదనా భరితమైన సాహిత్యమే కాని చౌకబారు బూతు సాహిత్యం కాదు.
చలం సాహిత్యం లొ వున్నది అంతా కుళ్ళిపోతున్న సంఘం మీద ద్వేషమే కాని,వ్యభిచారన్ని ప్రోత్సహించే సాహిత్యం కాదు.
చలం స్త్రీజనపక్షపాత రచయితకాదు కాని నవయుగ వైతాళికుడే.
"ఫుట్టగానే నా నోటి నుండి వెలువడ్డ ఏడుపు నీ కోసమే! మూర్ఖులు వీళ్ళు…, పాల కోసమనుకున్నారు" from ప్రేమలేఖలు !దీన్ని చాల మంది చాల రకాలుగా అర్దం చేసుకొవచ్చు.సరి అయిన అర్దం చలం అంతరంగం చుడగలిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుకుంటాను.
ఒకరి అభిప్రాయలని మార్చే వుద్దేశం లేదు కాని..కొన్ని గంటలలోనే మన నిర్ణయాలు మార్చుకొనే మనం ..చలం రచనలు అర్దం చేసుకోటానికీయినా స్త్రీ జాతిపై అయనకి గల అనితర సాధ్యమైన ప్రేమని ,అభిమానాన్ని అర్దం చేసుకోవాలి ..సంఘం కింద నలిగిపొతున్న స్త్రీ చలం సాహిత్యనికి మూలం అని గమనించాలి
@అబ్రకదబ్ర: జాగృతమైన మానసిక-భౌతిక వాంఛలను తీర్చుకోవడాని, నైతికత అనే భావనేలేని కాల్పనిక ప్రపంచంలోకి వెళ్ళిపోయే ఒక స్త్రీకథ మైదానం.
మీరు పదహారేళ్ళ వయసులో ‘మైదానం’ చదివి "రోత" అనుకున్నారు.సహజమైన కోరికలను అణిచి, భావనల్ని ప్రారద్రోలి,బలమైన నైతిక విలువల నడుమ, ఏది తప్పో ఏది కరెక్టో ఖచ్చితంగా సమాజం తెలియజెప్పే వయసది. ఆ వయసులో ఈ అభిప్రాయం కలగడం అర్థం చేసుకోదగ్గ పరిణామం.
కానీ ఆతరువాతైనా చలాన్ని చదివే ప్రయత్నం చెయ్యకుండా ఇలా నిర్ణయాలు ప్రకటించెయ్యడం ఆశ్చర్యకరం. అనంగీకారంకూడా. మీ అభిప్రాయాల్ని గౌరవించగలను, చర్చించడానికి తయారు కాగలను కానీ మీ అపోహల్ని ఏంచెయ్యమంటారు?
@సుజాత:
మైదానం ఒక ఆలోచన. సమాజంలోని hypocrisy కి వ్యతిరేకంగా రచయిత సృష్టించే parallel ప్రపంచానికి ప్రతీక.Its an imagery of resistance. దాన్ని ప్రాపంచిక నిజం అనుకుని చదివితే లేదా అలా జరుగుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు.బహుశా మీ ప్రయత్నం అలాంటిదే అయ్యుండచ్చు.
చలం alternate values స్థాపనకోసం పుస్తకాలు రాయలేదు. తన నిజాన్ని సామాజిక నిజానికి ఎదురుగా నిలిపి ప్రశ్నించాడు. చలం చెప్పినవాటినీ,చేసినవాటినీ అమలు చెయ్యాలనే రూలేం లేదే! నావరకూ,నాలోని బలహీనతల్ని,వాంఛల్నీ,అర్థరహితత్వాన్నీ అర్థం చేసుకోవడానికి, వాటిని celebrate చేసుకోవడానికీ నేను చలం సాహిత్యం చదువుతాను.
I believe it was one of the most personal literature ever written.
@మహేష్:
మైదానం తొలిసారి చదివినప్పుడు నా వయసు పదహారేళ్లని చెప్పాను గానీ, ఆ పుస్తకం ఆ తర్వాతెప్పుడూ చదవలేదనీ, ఆయనవి ఇతర పుస్తకాలేవీ చదవలేదని కానీ నే చెప్పలేదే. మైదానం లాంటి పుస్తకాలు ఎవరికన్నా నచ్చేది ఆ వయసులోనే. నాకప్పుడూ నచ్చలేదు, ఆ తర్వాతా నచ్చలేదు.
>> "సహజమైన కోరికలను అణిచి, భావనల్ని ప్రారద్రోలి,బలమైన నైతిక విలువల నడుమ, ఏది తప్పో ఏది కరెక్టో ఖచ్చితంగా సమాజం తెలియజెప్పే వయసది. ఆ వయసులో ఈ అభిప్రాయం కలగడం అర్థం చేసుకోదగ్గ పరిణామం"
సమాజమే కాదు, స్వయానా నా కుటుంబం చెప్పే విషయాలనీ బట్టీ వేసి నేర్చుకునే గుణం ఊహ తెలీక ముందు నుండీ లేదు నాకు. నా గురించి మీకర్ధమయిందేమిటోగానీ అది పూర్తిగా తప్పు. మీ అంచనా సరైనదైతే నేనా వయసులో ఆ పుస్తకమే చదివుండకపోయుండే వాడిని; ఎందుకంటే అప్పటికే దాని గురించి రక రకాలుగా వినున్నాను కాబట్టి.
వావి వరసల్లేకుండా కనబడ్డ ప్రతి ఆడదాన్నీ కాముక దృష్టితో చూసే కుసంస్కారి పిచ్చి రాతల్లో అదే ఆడ జాతినుద్ధరించే నీతులేరుకునే వాళ్లని ఏమనగలం? ఇది - చలం మనవరాలి అంతరంగం చదివాక నాకనిపించిన మాట.
@ మహేష్,
"మైదానం ఒక ఆలోచన. సమాజంలోని hypocrisy కి వ్యతిరేకంగా రచయిత సృష్టించే parallel ప్రపంచానికి ప్రతీక.Its an imagery of resistance"
నేను వీలైనంతగా వాస్తవంలో జీవించడానికి ప్రయత్నిస్తాను. అందువల్ల వాస్తవ జీవితానికి విరుద్ధంగా,(సంస్కరణ అయినా పాటించడానికి ఎవరికీ స్కోప్ లేని) ఉండే రచనలను అంత త్వరగా అంగీకరించలేను.
చలాన్ని దేవుడని పూజించే వాళ్లైనా సరే ఆయన రచనల్లోని జీవన శైలిని అనుసరిస్తారని నేననుకోను.
@అబ్రకదబ్ర:నచ్చడం నచ్చకపోవడం అనేవి వ్యక్తిగత అభిరుచినిబట్టి ఏర్పడే అభిప్రాయాలు. వాటిల్లో విభేధించడానికి ఏమీ ఉండదు. కానీ,dismissing Chalam as whole based on it, may not be a wise thing.
చలం ఆడజాతిని "ఉద్దరించాలని" అనుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించలేదు. ఆడవాళ్ళకూ అంతర్గత భావేవేశాలుంటాయని తన అనుభవంతో నేర్చుకున్నాడు.ఆ భావావేశాలకు తగిన గౌరవం ఇవ్వాలని కాంక్షించాడు,ఇచ్చాడు.
అయినా ఆడవారు తేరగా కూర్చును ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు. ఆడది ఒక మౌనవిప్లవం. ప్రతిరోజూ,ప్రతిచోటా (సమూలమైన)మార్పు తెస్తూనే ఉంటుంది.
ఆడదాన్ని ఆడదానిగా గౌరవించడం,అభిమానించడం,ప్రేమించడం కాముకత్వం అని మీరు నిర్ణయిస్తే చలం నిస్సందేహంగా కాముకుడే.ఇక వావివరసల సంగతంటారా...they are any way relative.
చలం మనుమరాలు ఇంటర్వ్యూలో చెప్పింది తన అనుకోలు (assumption),కానీ చలం ఉద్దేశం(intention) అదే అని నిర్ణయించగలమంటారా? మీరు కనీసం benefit of doubt ఇవ్వకుండా నిర్ణయించేస్తానంటే ఆపైన మీ ఇష్టం.
@సుజాత: కవి,రచయిత ఒక కాల్పనిక ప్రపంచాన్ని నిజమైన ప్రపంచానికి ధీటుగా సృష్టించడం ద్వారా, సామాజిక నిజాన్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించడం యొక్క ఉద్దేశం, సామాజిక విలువల్లో ఉన్న లొసుగుల్ని ఎత్తిచూపడమే తప్ప escapist గా మారి ఆ కల్పనల్లో బ్రతకమని కాదు.
మైదానం ఒక surrealistic నవల.కథా ప్రదేశం ఒక mind scape.అందుకే, అక్కడ జరిగేదాన్ని నిజమనుకోవడం, లేదా నిజ జీవితంలో అలా జరగాలనుకోవడం అర్థతహితం. రచయిత ఉద్దేశం,ఇలా జరిగే అవకాశం ఉన్నప్పుడు నిజమైన ప్రపంచంలో ఆ "హద్దుల్ని" ఎలా చెరపాలో ఆలోచించాలనే బీజాన్ని నాటడం.
ఇక్కడ సమస్యేమిటంటే, చలాన్ని మన భౌతిక విలువల నేపధ్యంలో బేరీజు చేసి అర్థం చేసుకోవాలనుకోవడం. లేదా వాటికి అనుగుణంగా లేడని నిరసించడం. అదీ కాకపోతే, తను చెప్పేది అక్షర సత్యమని (alternate truth గా) ప్రచారం చేసి మూర్ఖత్వాన్ని మూటగట్టుకోవడం. అన్నీ తప్పే! అందుకే చలం సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం అని నాకు అనిపిస్తుంది.
ప్రపంచ సాహిత్యంలో రెండో ప్రపంచయుద్ధం నాటికిగానీ రాని disillusionment with life and questioning the very existence of the "meaning" of life ఆలోచనలు చలం సాహిత్యంలో మొదటి ప్రపంచయుద్ధ కాలం నాటికి ముందే కనిపిస్తాయి.Fragmented consciousness ని అత్యంత లాఘవంగా అక్షరబద్ధం చేసిన అతికొద్దిమంది ప్రపంచసాహితీ కారుల్లో చలం ఒకరు.
నావరకూ చలం సాహిత్యం, ప్రత్యామ్నాయ విలువల్ని సృష్టించే సాహిత్యం కాదు. కాబట్టి ఆ విలువలు పాటించాలా? తను చెప్పేవాటిల్లో విలువెంత? వంటి ప్రశ్నలు నిరర్థకం.
చలం సాహిత్యం సంధించిన ప్రశ్నల సాహిత్యం. కాబట్టి ఎంతవరకూ existing విలువల్ని ప్రశ్నించి ఆకళింపు చేసుకున్నావు? ఎంతస్థాయిలో జీవితాన్ని గౌరవించి ఆ prescribed విలువల్ని త్యజించావు? అన్నవే సరైన ప్రశ్నలు.
చలం దేవుడు కాదు. మామూలు మనిషి. అందుకే అతని సాహిత్యం బలహీనతల సాహిత్యం. శైశవదశలో ఉన్న వాంఛల సాహిత్యం. అర్థం కాని శారీరక ఉన్మాదాల సాహిత్యం.Some one should give voice to such complexities in human life. He did it. అందుకే అతను ఒక ముఖ్యమైన సాహితీవేత్త.
చెలం అభిప్రాయంతో: "పేదరికపు కష్టాలలో శాంతి,ఆనందం తొనికిసలాడుతోంటై అని.ఏమంటారు ??"
అది చెలం అనుభవం. అందరూ దానితో ఏకీభవీంచాలని లేదు.
క్షమించాలి. నేను ఏకీభవించలేను.
@మహేష్:
>> "చలం ఆడజాతిని 'ఉద్దరించాలని' అనుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించలేదు"
ఆయన ఏమనుకున్నాడనేది నేను చెప్పలేదు. స్త్రీ స్వేఛ్చ ప్రస్తావనొచ్చినప్పుడల్లా చలం పేరెత్తి ఆ నాటి ఆయన రచనల వల్లే ఈనాడు సమాజంలో స్త్రీలకి ఈ మాత్రం స్వేఛ్చైనా ఉందని వాదించే వాళ్ల గురించి నేనన్నమాటది. (అదెంత హాస్యాస్పదమైన వాదనో చూడండి. దేశమంతా చలం కారణంగానే వచ్చిందా ఆ సమానత్వమూ, స్వేఛ్చా?). ఆయనేవో తన పెర్వర్షన్స్ బయటేసుకునే రచనలు చేస్తే కొందరు జనాలు వాటిని మహిళాజనోద్ధరణకి మూల సూత్రాలుగా తీర్మానించటం గురించి నా అభ్యంతరమది.
>> "అయినా ఆడవారు తేరగా కూర్చుని ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు"
ప్రస్తుత చర్చలో నేను మీతో ఏకీభవించే ఒకే ఒక వాక్యమిది.
>> "ఆడదాన్ని ఆడదానిగా గౌరవించడం,అభిమానించడం,ప్రేమించడం కాముకత్వం అని మీరు నిర్ణయిస్తే చలం నిస్సందేహంగా కాముకుడే"
భార్యనీ, ప్రేయసినీ ప్రేమించినట్లే కూతుళ్లనీ, మనవరాళ్లనీ కూడా ప్రేమించటం నా దృష్టిలో కాముకత్వమే. వావి వరసల విషయంలో సాపేక్ష సిద్ధాంతం అమలు చేసేంత విశాలభావాలు నాకు లేవు. ఆ మాత్రం కట్టుబాట్లు కూడా లేని సమ సమాజం నాకక్కర్లేదు. అది దారితీసేది అరాచకానికే. ఊహల నుండి వాస్తవంలోకొచ్చి చూడండి.
>> "చలం మనుమరాలు ఇంటర్వ్యూలో చెప్పింది తన అనుకోలు (assumption), కానీ చలం ఉద్దేశం (intention) అదే అని నిర్ణయించగలమంటారా"
పైన మీరే కదా 'ఆడదో మౌన విప్లవం, ప్రతి రోజూ ప్రతి చోటా సమూల మార్పులు తెస్తూనే ఉంటుంది' అంటూ ఆడాళ్ల శక్తి గురించి నాకు చెప్పారు. తనది ఉత్త 'అనుకోలో' కాదో తేల్చుకోలేని అమాయకురాలా ఆ చెప్పినావిడ? ఆవిడేమీ ఆషామాషీ వ్యక్తి కాదు కదా. చలం రచనలు చదివాక, ఆయన గురించి కుటుంబ సభ్యులే అంత వివరంగా చెప్పాకా కూడా ఆయన ఉద్దేశాలకీ, చర్యలకీ benefit of doubt ఇస్తూ కూర్చుంటానంటే నేనేం మాట్లాడగలను?
ఈ విషయమ్మీద ఇదే నా చివరి వ్యాఖ్య.
"దరికపు కష్టాలలో శాంతి,ఆనందం తొనికిసలాడుతోంటై అని.ఏమంటారు ??"
కందుకూరి వీరేశలింగం గారి "రాజశేఖర చరిత్ర" లో రాజశేఖరుడు గారు కూడా ఇలానే అనుకుంటారు, తను బాగా ధనవంతుడి గాఉన్నప్పుడు, పేదరికం వస్తే కానీ తెలియలేదు దానిలో ఇబ్బందులేమిటో ...
Bottom line ఏంటంటే, దూరపు కొండలు నునుపు ;)
దూరపు కొండలు నునుపు నిజమే!
పాత పేదరికాన్ని తలచుకుంటే ఆ రోజులు బాగుంటాయి:)
గత వైభవాన్ని గుర్తు తెచ్చుకునే వారికీ కూడా ఆ రోజులు బావుంటాయి:)
సో ఎప్పుడూ గడిచిపోయిన కాలం బావుంటుందన్న మాట :))
చలం
సాహిత్య సేవ చేయటానికి రాయనని ఆయనే చెప్పుకున్నారు.
నాకు చలాన్నిగానీ ఇంకెవరినైనాకానీ ఎండ గట్టేఅంత సాహిత్యం తెలియదు కానీ. ఆయన రచనలు చదివి అర్ధం చేసుకున్న అభిమానం తో ఏదైనా రాయటానికి ప్రయత్నించాలని http://gudipativenkatachalam.blogspot.com/
నాకు తోచిన పదాలతో రాయగలనేమోనన్న ప్రయత్నం. ఇక్కడి కామెంట్లు చూసినేను రాస్తున్న బ్లాగు.
Post a Comment