తెలుగుతనం- శ్రీ శ్రీ
తెలుగు విమర్శకుడికి తిట్టతంలో వున్న ప్రజ్ఞ మెచ్చుకోవడంలో లేదు.వేలెడంతేసివాడు జానెడంతేసివాణ్ణి చూసి,మూరెడంతేసివాళ్లున్నారు లేవోయ్ అంటాడు .తెలుగు విమర్శకుడానా అన్నాను?తెలుగు వాడన్న ప్రతి వాడికీ ఉన్న గుణమే అది.సినిమాకు వెళ్ళి ఈసడిస్తాడు.విందుకు వెళ్ళి వెక్కిరిస్తాడు
తెలుగు వాడికి సరియైన విమర్శప్రమాణ్యాలు లేకపోటమే ఇందుకు కారణమనుకొంటాను.గొర్రెలను తినేవాడెప్పుడూ ఉంటూనే ఉంటాడు.కాబట్టి కోళ్ళని తినే వాణ్ణి మెచ్చుకోనక్కరలేదన్నదే ఇతని వాదం అనవచ్చును.తెలుగు వాళ్ళలో పైకివచ్చిన వాళ్ళంతా పైకి పొయిన వాళ్ళే.
అయితే తెలుగు వాడిలో ఒక దుర్మార్గం మాత్రం లేదు.ఏదో ఒక కసి మనసులో పెట్టుకొని ఎవరినీ ఇతగాడు తిట్టడు.కేవలం ఈపనిని నిష్కా మకర్మగానే నిర్వహిస్తాడు.దుమ్మెత్తిపోయడం తెలుగువాడికి (ఇంగ్లీషులో చెప్పాలంటే) "ద్వితీయ ప్రకౄతి".
ఫలానా కవి చాలా మంచి పద్యాలు రాస్తాడని నువ్వంటే,వెంటనే మన తెలుగు వాడు పోనిద్దూ వాడు ఒక కవేనా అంటాడు.జాగ్రత్తగా గమనించాలి ఈ మన తెలుగు వాడు ఏదో ఒక ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటాడు.కవిత్వం జోలికికెప్పుడూ వెళ్ళిన పాపానపోయి ఉండడు .కాని తన అముల్యాభిప్రాయాన్ని జంకూ బొంకూ లేకుండా వెల్లడించి తీరుతాడు. నాకు తీరుబాటంటూ లేకపోతోంది కాని లేకపోతేనా దాని తాతలాంటి కావ్యం రాసిపారేద్దును అనే అభిప్రాయం అతని మనస్సులో ఎక్కడో అట్టడుగున పొడుస్తూనే ఉంటుంది.కాని ఆ మాట మాత్రం ఎప్పుడూ పైకి అనడు.
అలాగే మన ఆంద్రుడు తనకు తీరుబాటంటూ దొరికితే ఎన్నో చలనచిత్రాలు తయారుచేసేవాడు.అనవసరంగా గుజరాతీవాళ్ళతో పోటీ ఎందుకని పరిశ్రమ జోలికి పోలేదు.లేకపోతేనా?తాను ప్రారంభించినవే కదా పరిశ్రమలన్నీ-తీరుబాటు లేక ఆంధ్రేతరులకు అప్పగించేశాడుగాని.
ఇదో చిత్రం.తెలుగువాడు తానే అన్ని ఉద్యమాలను ప్రారంభించానని చాటుకుంటాడు.ప్రారంభం తనదయితే చాలు,అది తక్షణం ఆగిపోయినా బెంగలేదు మనవాడికి.మొదటి చలనచిత్రం ,మొట్టమొదటి ప్రత్యేక రాస్ట్రాందోలన ప్రజల బాష కోసం మొదట ఘోషపెట్టడం,ప్రప్రధమంలో సూటు తొడిగిన ఆంధ్రుడు-మున్మ్ముందుగా ఆటంబాంబును నేనే కనిపెట్టానని నేడో రేపో ఎవడైనా ఆంధ్రుడు స్టేట్ మెంటు ఇస్తే నాకేమీ ఆశ్చర్యమనిపించదు.
స్పర్ధకు బదులు సహకారం,అహంకారనికి బదులు ఆత్మనిగ్రహం ,వైముఖ్యానికి బదులు సౌముఖ్యం ఇవి మనకు కావలసినది. ఆంధ్రదేశంలోని అగ్రనాయకులలో వీటిని సకౄత్తుగా చుస్తాము.యువకులతరంలోనైనా ఇవి సమౄద్దిగా వికసిస్తే ఆంధ్రదేశంలో ప్రజాజీవితం ఫలిస్తుందని చెప్పుకోవచ్చును
3 comments:
మహబాగా చెప్పారు.
"తెలుగు విమర్శకుడానా అన్నాను?తెలుగు వాడన్న ప్రతి వాడికీ ఉన్న గుణమే అది" :)
మొత్తానికి శ్రీశ్రీ కూడా తెలుగోడే అనిపించుకున్నాడు :-)
Post a Comment